తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు సెక్షన్-144, పోలీస్ యాక్ట్-30 అమలులో ఉన్నందున ఎటువంటి ర్యాలీలు, యాత్రలు, ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ పి.జగదీష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ ప్రొఫెషనల్స్ పేరుతో చేపట్టిన కారు సంఘీభావ యాత్రకు ఎటువంటి అనుమతి లేదని, జిల్లాలోకి ఈ యాత్ర ప్రవేశిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కారు యజమాని, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టంచేశారు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తారని చెప్పారు. ఈమేరకు ఆర్టీవోకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లా ప్రజల ప్రశాంత జీవనానికి ఆటంకం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలను కాపాడాలని పోలీస్ అధికారులను ఆదేశించామని చెప్పారు.