Nitin Gadkari:
దిల్లీ: ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా దేశంలో అన్ని జాతీయ రహదారుల (National Highways)పై గుంతలు లేకుండా చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు..
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధి విధానాలను సిద్ధం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే దేశంలోని 1,46,000 కి.మీ మేర జాతీయ రహదారుల మ్యాపింగ్ ప్రక్రియ పూరైందని, త్వరలో గుంతలు పూడ్చేందుకు అవసరమైన నిర్వహణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. త్వరలో నిర్మించబోయే రహదారుల నిర్మాణానికి బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (BOT) పద్ధతిలో కాంట్రాక్టులు జారీ చేస్తామని తెలిపారు. ఈ విధానంలో రహదారుల నిర్మాణం జరిగితే ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు..
”సాధారణంగా రహదారుల నిర్మాణం మూడు పద్ధతుల్లో జరుగుతుంది. బీవోటీ, ఇంజినీరింగ్ – ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM). ఈపీసీ కింద నిర్మించిన రోడ్లకు త్వరగా నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. బీవోటీ కింద నిర్మించిన వాటికి రాబోయే 15-20 ఏళ్లపాటు నిర్వహణ ఖర్చును గుత్తేదారు భరించాల్సి ఉంటుంది. కాబట్టి రోడ్డును నిర్మాణం సమయంలోనే పటిష్ఠంగా నిర్మిస్తాడు. అలానే, నిర్వహణ కోసం ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని గుత్తేదారు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి టోల్ రూపంలో వసూలు చేసుకోవచ్చు. కానీ, ఈపీసీ విధానంలో రోడ్డు నిర్మాణం, నిర్వహణకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చాలి. అందుకే బీవోటీ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించాం” అని నితిన్ గడ్కరీ తెలిపారు..
This post was created with our nice and easy submission form. Create your post!