- గ్రామాల్లో ప్రజలకు కనీసం తాగునీరు సదుపాయం సమకూరడం లేదు. రక్షిత మంచినీటి పథకాలు నిర్మించక గిరిజనులు ఊటలు, గెడ్డల నీరు వినియోగిస్తున్నారు. మైళ్లదూరం ప్రయాణించి ఈ నీరు తెచ్చుకుని తాగుతున్నారు. దీంతో వ్యాధులబారిన పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని 23 పంచాయతీల్లో ఉన్న 378 గ్రామాల్లో సుమారు 120 గ్రామాలకు తాగునీటి వసతులు లేవు. బూసీపుట్టు, కుమడ, బాబుసాల, బుంగాపుట్టు, రంగబయలు, వనుగుమ్మ, లక్ష్మీపురం, పనసపుట్టు, మాకవరం, వనబసింగి పంచాయతీల్లోని గ్రామాల్లో ప్రజలు గెడ్డ నీరు వినియోగిస్తున్నారు. వనబసింగి పంచాయతీలోని బొండాపుట్టులో రెండు వీధులు ఉన్నాయి. అక్కడి ప్రజలు గెడ్డలపైనే ఆధారపడుతున్నారు. వర్షాలతో నీరు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.బూసీపుట్టు, కుమడ, రంగబయలు, బుంగాపుట్టు ప్రాంతాల్లో వర్షాలకు గెడ్డలు ఉప్పొంగి కాలువలు, ఊటగెడ్డలు బురదమయంగా మారాయి. ఈ నీటిని తాగి ఎక్కవమంది గిరిజనులు జ్వరాలబారిన పడుతున్నారు. గత రెండు నెలల వ్యవధిలో లబ్బూరు, కిలగాడ, రూఢకోట పీహెచ్‌సీల్లో, ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రంలో టైఫాయిడ్ జ్వర కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధికారులు స్పందించి గ్రామాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!