అనకాపల్లి జిల్లా:ఆన్‌లైన్ మోసానికి మరొకరు నష్టపోయారు. సైబర్ నేరాలపై పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. అడ్డగోలుగా, తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించాలనే ఆశ గల వ్యక్తులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. ఇదే తరహాలో ‘ఇంటి దగ్గర ఉండి సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలి’అనే లింకు క్లిక్ చేసి, అచ్యుతాపురానికి చెందిన మహిళ రూ.2 లక్షల 76 వేలను పోగొట్టుకుంది. దీంతో పేరు బయటపెట్టేందుకు ఇష్టపడని సదరు బాధితురాలు అచ్యుతాపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాయిన్ స్విచ్ పేరిట ఏర్పాటైన సంస్థ ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వాట్సాప్ నంబర్లకు వివిధ రకాల యాడ్ లింకులు పంపిస్తోంది. ఇంటి దగ్గరే ఉంటూ మొబైల్ ఫోన్ ద్వారానే ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చని నమ్మబలికింది. తాము పంపే స్టార్ హోటల్స్, రెస్టారెంట్లకు రేటింగ్ ఇస్తే చాలని చెప్పింది. ఒక్కో రేటింగ్‌కు రూ.70 నుంచి రూ.210 వరకు కమీషన్ చెల్లిస్తామని నమ్మించింది. అనంతరం కొన్ని టాస్క్‌లు ఉంటాయని, వాటిని పూర్తి చేస్తే మరింత సంపాదించుకోవచ్చని ప్రలోభపెట్టింది. రూ.1000 చెల్లించి ఓ టాస్క్ ఎంపిక చేసిన వారికి బోనస్ రూ.200 కలిపి ఆరంభంలో రూ.1200 చెల్లించింది. అలా వారిలో నమ్మకాన్ని పెంచడంలో సంస్థ నిర్వాహకులు సఫలీకృతులయ్యారు. తర్వాత పెద్ద మొత్తంలో టాస్క్‌లకు చెల్లింపులు చేశాక, టాస్క్ పూర్తి చేయడంలో పొరపాటు చేయడం వల్ల డబ్బులు ఫ్రీజ్ అయినట్టు చెప్పేవారు. ఆ మొత్తం రిలీజ్ కావాలంటే అదనంగా టాస్క్‌లు తీసుకోవాలన్నారు. బాధితురాలు ఇలా అదనపు చెల్లింపులతో రూ.2.76 లక్షలను పోగొట్టుకుంది. ఆ మొత్తం రావాలంటే మరో రూ.4 లక్షలు చెల్లించాలని నిర్వాహకులు చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించిన ఆమె ఎట్టకేలకు పోలీసులనాశ్రయించింది. అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
[zombify_post]

